Sunday, November 9, 2008

ఆనందం..

ఈ రోజు నాకో ధర్మసందేహం వచ్చింది,"అసలు ఆనందం అంటే ఏమిటి?"అని.ఎవర్ని అడుగుదామా అనుకుంటుంటే అప్పుడే అమ్మొచ్చింది.సరేలే తననే అడుగుదామని మొదలెట్టా-"అమ్మా!నీ ఉద్దేశ్యం లో ఆనందం అంటే ఏమిటి?" అని."ఏమిటే ఈరొజు పొద్దునే మొదలెట్టావ్?నీకు అఫీసుకి టైం అవుతోంది గా,లేచి రెడీ అవ్వు""లేదమ్మా నువ్వు చెప్పు.నేను రెడీ అవుతానులే""వదిలి పెట్టవు కదా.సర్లే,నాకు ఆనందం అంటే,నా భర్తా,పిల్లలూ ఎలాంటి సమస్యలూ లేకుండా,ఎప్పుడూ సంతోషంగా ఉండడమే" అని ఆప్యాయంగా నుదుటిపై ఒక ముద్దిచ్చి వెళ్ళిపోయింది.

************************************************


ఆఫీసు క్యాబ్ వచ్చింది,మొదటి స్టాప్ నాదేకావడంతో నేనూ,డ్రైవర్ తప్ప ఎవరూ లేరు.నా సందేహం మళ్ళీ నేనున్ననంటూ బయటకు వచ్చింది.సరేలే తెలిసిన డ్రైవరేగా అని అడిగేశా,"మస్తాన్!నీ దృష్టిలో ఆనందం అంటే ఏమిటి?" అని.అతను తలగోక్కుంటూ,"ఏమో మేడం!నాకిలాంటి పెద్ద మాటలు తెలీవు.కానీ నాకు జబర్దస్త్ ఖుషీగా ఉండేది మాత్రం,డీజిల్ సస్తా అయిపోయి,ఓ నాలుగు మంచి బేరాలు తగిలి, అనుకున్న దానికన్నా ఎక్కువ బత్తా దొరికి, మా బేగం కు ఓ చీర తీసుకెళ్ళిన రోజు మేడం" అని సిగ్గుపడుతూ చెప్పాడు.అతనికి కొత్తగా పెళ్ళైన విషయం అప్పుడే గుర్తొచ్చి నవ్వొచ్చింది.
************************************************
ఆఫీసు సీట్లో కూర్చోగానే సరిత హాయ్ చెప్పింది.నా మనసు ఊర్కుంటుందా!తనను కూడా అడిగేశా "నువ్వేమంటావ్ ఆనందం గురించి" అని."ఏంటే,అఫీసుకి వచ్చి రాగానే ఏదేదో అడిగేస్తున్నావ్?అయినా, నాకు ఆనందం అంటేనా?వీకెండ్ కు ఊరెళ్ళి మళ్ళీ భాధగా తిరిగివచ్చెయాల్సినపుడు అనుకోకుండా మండే కూడా హాలిడే వస్తే ఎగిరి గంతెయ్యాలనిపిస్తుంది చూడు..అది"అంది.
************************************************
బ్రేక్ లో కాఫీ తగడనికెళ్ళా.నా టీం మేట్ సందీప్ వచ్చాడు.తనని కూడా అడిగా."చెప్పమంటావా..నాకు ఆనందం అంటే నేను ప్రేమించిన అమ్మాయి అందమైన కళ్ళలోకి చూస్తూ,తనతోకలిసి అడుగులేస్తూ ఈకాలం ఇలాగే ఆగిపోనీ అనుకుంటూ ఉండిపోవడం"అని చెప్పుకుంటూపోయాడు."ఓ!ఓకె,ఓకె..ఇక చాల్లేబాబూ వదిలితే కావ్యమే చెప్పేట్టున్నావ్,ఇక చాలు" అంటూ ముగించా.
************************************************
లంచ్ టైంలో క్యాంటీన్ కు వెళ్ళగానే ప్రాజెక్ట్ మానేజర్ కనిపించారు.ఆయన ఫ్రెండ్లీ నే కాబట్టి కాస్త ధైర్యంగానే నా సందేహన్ని అడిగేశా .ఆయన నవ్వుతూ,"నిజంగా చెప్పమంటావామ్మ,లాస్ట్ మినిట్ లో ఏ టెన్షన్ లేకుండా కరెక్ట్ టైం కి నా ప్రాజెక్ట్ డెలివర్ చెయ్యడమే నాకు ఆనందం "అన్నారు.
"ఏమైనా ఈయన సిన్సియర్!ప్రాజెక్ట్ లోనే ఆనందం వెతుక్కుంటున్నారు"సరిత చిన్నగా అంది.
***********************************************
సాయంత్రం కొలీగ్ బర్త్ డే పార్టీ జరిగింది.శుభాకాంక్షలు చెప్పి ఆయన్నుకూడా అడిగేశా,"సర్,మీ దృష్టిలో ఆనందం అంటే ఏమిటి?" అని.
పార్టీ మూడ్ లో ఉన్నారేమో,"ఈరోజులా celebrate చేసుకోవడానికి రోజూ నాకో reason దొరకడం"అన్నారు నవ్వుతూ.
************************************************
ఆఫీసునుంచి వస్తుంటే జమున గారు కలిశారు.నా ప్రాణం నిలుస్తుందా!ఆమెనీ కదిలించా.
"ఏంటో రా,ఈ ఆఫీసు,ఇంటి పనుల ఒత్తిడితో ఆయన,చింటూతో లతో ఎక్కువగా గడపలేక పోతున్నా.ఆఫీసు పనులు త్వరగా అయిపోయి,ఇంట్లో వీళ్ళతో హాయిగా గడపగలిగితే అదే నాకు ఆనందం" అన్నారు పక్కనున్న చింటూను చూపిస్తూ."మరి నీకు ఎప్పుడు చింటూ హ్యాపీ?"వాడిని కుడా అడిగా."మమ్మీ,దాదీ కలిసి నన్ను టాటాకు తీసుకెళ్ళి బోలెడన్ని చాకీలు తీసిత్తారే అప్పుదు" అన్నాడు ముద్దుగా.
వారికి బై చెప్పి దారిలో వస్తుంటే ఎదురింటి తాతయ్య కనిపించారు తన మనవడు,మనవరాలితో."ఏమ్మా అఫీసునుంచా?" అడిగారు."అవును తాతగారూ!మీరు వాకింగ్ కు వచ్చారా?" కాసేపు మట్లాడి నా సందేహాన్ని ఆయన ముందూ ఉంచా."ఇంకెముందమ్మా,ఇదిగో నా మనవడు,మనవరాలూ!వీళ్ళతో ఆడుకుంటూ గడిచిపోయిన నా బాల్యాన్ని మళ్ళీ కొత్తగా అనుభవిస్తున్నానే,అదే నాకు ఆనందం " అన్నారు బోసినవ్వుతో అందంగా.
ఆయన దగ్గర సెలవు తీసుకొని ఇంకొంచెం ముందుకు రాగానే తెలిసిన నన్ కనిపించారు."మంచి టైం కు కనిపించారు" అనుకొని ఆమెనూ అడిగా "సిస్టర్!మీ దృష్టిలో ఆనందం అంటే ఏమిటి?" అని.ఆమె నిర్మలంగా నవ్వుతూ,"నిస్సహాయులకు వీలైన సహాయం చేసినపుడు వారి కళ్ళలో కనిపించే తృప్తే నాకు ఆనందం"అన్నారు.
ఆలోచిస్తూ ఇంటిదారిపట్టా.గేటు తీయగానే టైగర్ తోకూపుకుంటూ ఎదురొచ్చింది.దాన్ని కూడా వదలాలనిపించలేదు."నీకేమిటే ఆనందం ఇచ్చేది?" ఎత్తుకుని అడిగా."ఇంటికి రాగానే మొదట నాతోనే ఆడుకోవాలి" అంటున్నట్టు కుయ్ కుయ్ మంటూ తోకూపింది.
ఇంట్లోకి వెళ్ళి చూస్తే కజిన్ వచ్చాడు.పలకరింపులయ్యాక,"ఏరా నువ్వేమంటావ్ ఆనందం అంటే?" అనడిగా."అక్కా!నాకు మాత్రం నాన్న ఎందుకూ,ఏమిటీ అని అడక్కుండా అడిగినంత పాకెట్ మనీ ఇచ్చేసి క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళినా లైట్ తీసుకుని ఏమీ అనకుండా వుంటే అదే" అన్నాడు అల్లరిగా.
"ఆహా!ఈసారి ఇంటికొచ్చినపుడు బాబాయికి చెప్తా నీ సంగతి" ఆటపట్టించా.
************************************************
రాత్రి భోజనాల తర్వాత నాన్న కు చెప్పా పొద్దున్నుంచీ నా అనుభవాలని.

"నాన్నా! ఈ రోజంతా నేను చాలా మందితో మాట్లాడాను.ఏ ఇద్దరూ ఒకే విషయం వారికి ఆనందం కలిగిస్తుందని చెప్పలేదు.నువ్వు చెప్పు,ఏది నిజమైన ఆనందం అంటే"నాన్న నవ్వుతూ,"ఆనందం ఒక భావోద్వేగం రా!అది ఎవరికి వారు మాత్రమే అనుభవించగలిగే ఉన్నతస్థితి.ఇలాంటి భావాలను అనుభవించగలమే తప్ప ప్రశ్నించలేం.తమ నేపధ్యాలూ,అనుభవాల దృష్ట్యా ఎవరి ఉద్వేగాలు వారికి ఉన్నతంగా అనిపిస్తాయి.ఇతరులతో పోల్చి చూసినపుడు ఒకరి అనుభూతులు మరొకరికి చాలా సింపుల్ గా,చిన్న విషయాలుగా కనిపించొచ్చు.అలాగని వాటి విలువను,అది వారిపై చూపించే ప్రభావాన్ని తక్కువ చేయలేం.ఒక ధనవంతుడికి తను పెద్ద కాంట్రాక్ట్ పొందడం ఆనందాన్నిస్తే,ఒక యువకుడికి ఇది చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు. కానీ అదే యువకుడికి ప్రేయసి తన ప్రేమను అంగీకరించడం గొప్ప ఆనందం కలిగించొచ్చు.అందుకే ,ఆనందం ..అది రేపే ఉద్వేగం ఖండితంగా వ్యక్తిగతం.జీవితం లో మనకు ఎదురయ్యే చిన్న చిన్న ఆనందాల్ని మిస్సవ్వకుండా అనుభవిస్తూ..మరికొన్ని అలాంటి సంధర్భాలను మనమే క్రియేట్ చేసుకుంటూ.. పక్క వాళ్ళకు కూడా ఆనందాన్ని పంచుతూ..వీలైతే అవసరంలో ఉన్నవాళ్ళకు చేతనైన సహాయం చేస్తూ..జీవితం హాయిగా గడిపేయడమే నా దృష్టిలో అసలైన ఆనందం అంటే" అన్నారు.
************************************************
ప్రయత్నిస్తున్నా అర్థం చేసుకోవడానికి...

Tuesday, October 21, 2008

టైగర్..

ఈ లెక్చరర్ ఎంత సేపు బాదుతాడూ..అసలే రేపటినుంచి సెలవులు..త్వరగా హాస్టల్ కి వెళ్లి లగేజీ తీసుకొని బస్సెక్కాలి...ఆ సీటు దొరుకుతు౦దో ,దొరికినా కిటికీ పక్కగా దొరుకుతుందో లేదో?
****************************
"అమ్మా !నేనోచ్చేసాను !!".

" ఏమిటేఅంత చిక్కిపోయావ్?అసలు హాస్టల్ లో తింటున్నావా లేదా?"

"ఏంటమ్మా రెండు కేజీలు పెరిగాను ఇప్పటికే !నువ్వెప్పుడూ ఇంతేలేనాన్నెక్కడ? "

"బయటకు వెళ్ళారే నీకిష్టమైన స్వీట్ తీసుకురావటానికి"

"హాయ్ రా నాన్న! ఎంతసేపైంది వచ్చి? నువ్వోచ్చేలోపు వచ్చేద్దామని వెళ్లానురా, సారీ ! లేట్ అయింది"

"పర్లేదులే డాడీ !నేనోచ్చింది ఇప్పుడే, ఏరా తేచ్చావు నాకోస౦ ?ఏంటది బుట్టలో?"

"ఇదా?నువ్వే చూడు"అంటూ బుట్ట నాచేతికిచ్చారు నాన్న!చేతి పైకి ఏదో పాకినట్లైంది.

"కెవ్వు మని కేకేసి ఉదుటన నాన్న పైకి విసిరేశా.చూస్తే చిన్కుక్కపిల్ల తల బైట పెట్టి చూస్తోంది .

నాన్న నవ్వుతూ .."దారిలో వస్తుంటే కనిపించింది రా!వెనకే వస్తుంటె తీసుకొచ్చా.బావుందా?"

"ఏమిటండి "దానికి కుక్కలంటే ఎంత భయమో తెలీదా " అమ్మ అ౦ది.

"అవుననుకో కాని అలవాటైతే సరిపోతు౦ది అని తెచ్చాను .దీనికి ఏంపేరు పెడదాం?ఆ!' టైగర్ '.ఓకే నా?

"పో నాన్న,దీన్నెందుకు తెచ్చావ్ ఇప్పుడు?నా స0గతి తెలుసుకదా నీకు " అన్నాను .

"రె౦డు రోజులు చూడు రా అప్పటికీ నచ్చక పొతే పంపేద్దాం,సరేనా?"

"పో నాన్న నీ ఇష్టం,నాకైతే ఇష్టంలేదు"

"సర్లే,రండి ఇక భోంచేద్దాం,అసలే ప్రయాణం చెసొచ్చావ్"అమ్మ అంది.

"ఔను,పద పదరా ఇప్పటికే ఆలస్యం అయింది "అన్నారు నాన్న.

*********************************************

మరుసటి రోజు లేవగానే పేపర్ చదవడానికి పొర్టికో లోకి వచ్చా.రాత్రి వర్షం పడిందేమో వాతావరణం చల్లగా,చాలా బావుంది.వేడి వేడిగా కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నానా..కాలికి ఏదో చల్లగా తగిలింది.
ఉలిక్కిపడి చూస్తే, టైగర్..అదే ఆ కుక్కపిల్ల నా కాలు నాకుతోంది. కెవ్వుమంటూ ఇంట్లోకి పరిగెట్టా.
"దాన్ని పంపేయండి నాన్న,బయటకు కూడా వెళ్ళలేక పొతున్నా".
అమ్మా,నాన్న నవ్వుతున్నారు.
"పాపం అదేంచేసింది రా బుజ్జిది.అసలు తనకు నచ్చిన వాళ్ళనే తెలుసా అది నాకేది.అంటే దానికి నువ్వు నచ్చావన్నమాట".
"ఆహా!,అయినా అది నాకు నచ్చలెదుగా,నాకు భయం.పంపేయండి నాన్నా"బుంగమూతి పెట్టా.
"సరేలే రా రెండురోజులేగా చుద్దాం "
* ***************************************

నాన్న దానికి బాగ ఫ్రెండ్ అయిపొయారు.అన్నంతినెప్పుడు కూడా మొదట దానికి ఒక ముద్ద పెట్టి తర్వాతే తింటున్నారు.బయటి నుంచి రాగానే దాన్ని మట్లాడుతున్నారు. అదీ నన్నుపక్కన పెట్టెసి..
2 రోజులు దాటిపొయాయ్ గాని నాన్న దాన్ని పంపెయ్యలేదు.

రోజు రోజుకూ నాకు ఆ టైగర్ పైన అసూయ,కోపం పెరిగిపోతున్నాయి.అమ్మ కూడ దాన్ని ముద్దు చేస్తొంది.ఇక ఈ ఇంట్లో టైగర్ తర్వాతేనా నేను..నో, ఏదొ ఒకటి చెయ్యాలి..

*************************************************

"రాత్రి లోపు వచ్చేస్తాం కన్న!పక్క ఊర్లోనేగా పెళ్ళి"నాన్న అన్నారు."పో నాన్న నేను మీకోసం హాస్టల్ నుండి వస్తే,మీరు నన్ను వదిలి ఏదొ పెళ్ళి చూడ్డానికి వెళ్తారా?మీతొ నేను మాట్లాడను"."లేదురా మా బాస్ కూతురి పెళ్ళి.తప్పకుండా వెళ్ళాలి .రాత్రిలోపు వచ్చేస్తాం.అయినా నీకు తోడు టైగర్ కూడా ఉందిగా".

నా శత్రువు నాకు తోడా?!హు(. . . .

***************************************************


ఆకలేస్తోంది.అమ్మ వంట చెసే వెళ్ళిందిగా.తినాలి.అయినా నాన్న ఆ టైగర్ గాడికి కూడా ఏదైనా పెట్టమంటాడా!!అసలు ఇదే మంచి చాన్స్.దాన్ని ఇంటి నుండి పంపెయ్యడానికి.కాని..ఎలా?ఆ(..రోజంతా దానికి తిండి లేకుండా చేస్తే సరి,అదే వెళ్ళిపొతుంది వేరే చోటికి..



ఈ ఆలోచన రాగానే హాయిగా భోంచేసి T.Vచూస్తూ కూర్చున్నా."అవునూ..ఇదేంచేస్తోందో?కిటికి లోంచి చూద్దాం".



"ఏంటిది?కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది?ఓ!ఆకలెస్తొందా?కాని..కాని..నీ సంగతి ఇంతే ఇక్కణ్ణుంచి వెళ్ళేవరకు..హ హ హ "!



**********************************************



"బాగా తిన్నాగా,మంచి నిద్ర పట్టేసింది.ఈ టైగర్ ఇప్పటికి కచ్చితంగా వెళ్ళిపొయే ఉంటుంది;పొద్దుణ్ణుంచి ఎమీ పెట్టలేదుగా.చుద్దాం.."బయటకెళ్ళి చూశా..కనబడలేదు,చిన్నగా పిలిచా టైగర్.. అని,పలకదే?యాహూ!సాధించాను!అది వెళ్ళిపొయిందన్నమాట..వెరీ గుడ్,నాదె విజయం..ఈ occassion ను సెలెబ్రేట్ చేసుకొవలి ఈ ఆపిల్ తో..

పండు తెచ్చుకుని కట్ చేస్తున్నా..చేతిని ఏదో లాగుతున్నట్లనిపించింది... ఛ!..ఇది ఇంకా వెళ్ళలేదా,విసుగ్గా తిరిగా..పెద్ద కోతి..నా చేతిలోని పండునే చూస్తోంది.అదిరి పడ్డా.కర్ర అందుకోవాలని ప్రయత్నిస్తున్నా.కాని ఆ కోతి ఎలాగైన ఆ పండు తీసుకెళ్ళాలని పట్టుదలగా ఉన్నట్టుంది.కొపంగా నా మీదకు వస్తోంది..వచ్చేస్తోంది..అయిపొయింది,నా మొహం ఆ కోతిలానే ఎర్రగా అయిపోవడం ఖాయం..

ఇంతలో ఎక్కడనుండి వచ్చిందో టైగర్,ఆ కోతి పైకి కలబడుతోంది.చిన్నదైనా కూడదీసి దాన్ని తరమడానికి ప్రయత్నిస్తోంది.ఆ కోతి మాత్రం తక్కువ తిందా?పండు లేకుండా అది ఇక్కణ్ణుంచి వెళ్ళేలా లేదు..

పొద్దుణ్ణించి తిండి లేదు కదా కాసేపటికి టైగర్ నీరసపడిపోయింది..దాంతో కోతి దాన్ని పక్కకు తోసేసి పండు తీసుకెళ్ళిపోయింది.ఆ పడడం రాయిపైన పడడంతో టైగర్ కు గాయమై రక్తం కారుతోంది!పాపం నాకోసమే కదా అది అంతా చేసింది!మందైనా రాయలి..ఆకలి కూడా వేస్తుంటుంది పాపం..అన్నం పెట్టి,మందు కూడా రాశా..తోకూపుకుంటూ నాకాలిచుట్టూ కాసేపు తిరిగి,కుయ్..కుయ్..అంటూ పడుకుంది.

***********************************************

8 గం!అయింది.అమ్మా,నాన్న వచ్చారు.నాన్న!అంటూ నేను వెళ్తున్నా..ఈలోపు టైగర్ వెళ్ళి నాన్న మీదకు ఎగురుతోంది..ఈ సారి నాకు కోపం రాలేదు."అరే, ఏంట్రా ఏదో గాయమైనట్టుందే టైగర్ కు?" నాన్నడిగారు.

"అవును నాన్నా,కోతి నాపైకి వస్తోంటే ఇదే అడ్డుపడింది".

"ఓ! వెరీ గుడ్!!నేను చెప్పాగా ఇది నీకు మంచి తోడు అని".

"అవును నాన్నా!నాక్కూడా ఇది నచ్చింది".

"అయితే ఫ్రెండ్స్ అయిపోయరన్నమాట".

"అవును నాన్నా" .

అన్నీ అర్థం అయినట్టు వచ్చి నాకాలు నాకుతూ నాపైకి ఎగురుతోంది ప్రేమగా నా ఫ్రెండ్ టైగర్...



Sunday, October 19, 2008

ఇంతే ఇంతే.....

ఇందాకే ఒక కథ మొదలు పెట్టా.ఈ సమాజం లోని మూడనమ్మకాలూ ,మూర్ఖపు భావనల గురించి ఏదో ఒకటి రాసేయాలని అనుకుంటున్నాఈ సారి.ఏమిటి,పొద్దున్న లేచింది మొదలు ప్రతి విషయంలోనూ ఈ నమ్మకాలూ..రోజులో ఎం జరిగినా పొద్దున్న ఎవరి మొహం చూసానో అనుకోవడం ..ఇంటి నుండి బయటకు వెళ్ళాలంటే శకునాలు చూడడం.ఎ పని చెయ్యాలన్నా రాహు కాలాలు,వర్జ్యాలు లెక్క పెట్టుకోవడం ...ఏమిటో ఇది ఎప్పుడు మారుతారో ఏమో ఈ మనుష్యులు !!!
***********************************************************
అవునూ...అమ్మా ,ఈ వారంలో ఒక మంచి రోజు చూడు కథను పత్రికకు పంపాలి .............

Saturday, October 18, 2008

మొదటి మెట్టు

నెట్ లో తెలుగు వెలుగులను విరజిమ్ముతున్న తెలుగు బ్లాగర్లందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు..తెలుగు వేర్లు కలిగిన బ్లాగుల వృక్షం లో మరిన్ని పువ్వులు పూయాలని,వాటి ఫలాలు మరింతమందికి చేరి మన తెలుగు వెలుగు విశ్వవ్యాప్తం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...