Sunday, November 9, 2008

ఆనందం..

ఈ రోజు నాకో ధర్మసందేహం వచ్చింది,"అసలు ఆనందం అంటే ఏమిటి?"అని.ఎవర్ని అడుగుదామా అనుకుంటుంటే అప్పుడే అమ్మొచ్చింది.సరేలే తననే అడుగుదామని మొదలెట్టా-"అమ్మా!నీ ఉద్దేశ్యం లో ఆనందం అంటే ఏమిటి?" అని."ఏమిటే ఈరొజు పొద్దునే మొదలెట్టావ్?నీకు అఫీసుకి టైం అవుతోంది గా,లేచి రెడీ అవ్వు""లేదమ్మా నువ్వు చెప్పు.నేను రెడీ అవుతానులే""వదిలి పెట్టవు కదా.సర్లే,నాకు ఆనందం అంటే,నా భర్తా,పిల్లలూ ఎలాంటి సమస్యలూ లేకుండా,ఎప్పుడూ సంతోషంగా ఉండడమే" అని ఆప్యాయంగా నుదుటిపై ఒక ముద్దిచ్చి వెళ్ళిపోయింది.

************************************************


ఆఫీసు క్యాబ్ వచ్చింది,మొదటి స్టాప్ నాదేకావడంతో నేనూ,డ్రైవర్ తప్ప ఎవరూ లేరు.నా సందేహం మళ్ళీ నేనున్ననంటూ బయటకు వచ్చింది.సరేలే తెలిసిన డ్రైవరేగా అని అడిగేశా,"మస్తాన్!నీ దృష్టిలో ఆనందం అంటే ఏమిటి?" అని.అతను తలగోక్కుంటూ,"ఏమో మేడం!నాకిలాంటి పెద్ద మాటలు తెలీవు.కానీ నాకు జబర్దస్త్ ఖుషీగా ఉండేది మాత్రం,డీజిల్ సస్తా అయిపోయి,ఓ నాలుగు మంచి బేరాలు తగిలి, అనుకున్న దానికన్నా ఎక్కువ బత్తా దొరికి, మా బేగం కు ఓ చీర తీసుకెళ్ళిన రోజు మేడం" అని సిగ్గుపడుతూ చెప్పాడు.అతనికి కొత్తగా పెళ్ళైన విషయం అప్పుడే గుర్తొచ్చి నవ్వొచ్చింది.
************************************************
ఆఫీసు సీట్లో కూర్చోగానే సరిత హాయ్ చెప్పింది.నా మనసు ఊర్కుంటుందా!తనను కూడా అడిగేశా "నువ్వేమంటావ్ ఆనందం గురించి" అని."ఏంటే,అఫీసుకి వచ్చి రాగానే ఏదేదో అడిగేస్తున్నావ్?అయినా, నాకు ఆనందం అంటేనా?వీకెండ్ కు ఊరెళ్ళి మళ్ళీ భాధగా తిరిగివచ్చెయాల్సినపుడు అనుకోకుండా మండే కూడా హాలిడే వస్తే ఎగిరి గంతెయ్యాలనిపిస్తుంది చూడు..అది"అంది.
************************************************
బ్రేక్ లో కాఫీ తగడనికెళ్ళా.నా టీం మేట్ సందీప్ వచ్చాడు.తనని కూడా అడిగా."చెప్పమంటావా..నాకు ఆనందం అంటే నేను ప్రేమించిన అమ్మాయి అందమైన కళ్ళలోకి చూస్తూ,తనతోకలిసి అడుగులేస్తూ ఈకాలం ఇలాగే ఆగిపోనీ అనుకుంటూ ఉండిపోవడం"అని చెప్పుకుంటూపోయాడు."ఓ!ఓకె,ఓకె..ఇక చాల్లేబాబూ వదిలితే కావ్యమే చెప్పేట్టున్నావ్,ఇక చాలు" అంటూ ముగించా.
************************************************
లంచ్ టైంలో క్యాంటీన్ కు వెళ్ళగానే ప్రాజెక్ట్ మానేజర్ కనిపించారు.ఆయన ఫ్రెండ్లీ నే కాబట్టి కాస్త ధైర్యంగానే నా సందేహన్ని అడిగేశా .ఆయన నవ్వుతూ,"నిజంగా చెప్పమంటావామ్మ,లాస్ట్ మినిట్ లో ఏ టెన్షన్ లేకుండా కరెక్ట్ టైం కి నా ప్రాజెక్ట్ డెలివర్ చెయ్యడమే నాకు ఆనందం "అన్నారు.
"ఏమైనా ఈయన సిన్సియర్!ప్రాజెక్ట్ లోనే ఆనందం వెతుక్కుంటున్నారు"సరిత చిన్నగా అంది.
***********************************************
సాయంత్రం కొలీగ్ బర్త్ డే పార్టీ జరిగింది.శుభాకాంక్షలు చెప్పి ఆయన్నుకూడా అడిగేశా,"సర్,మీ దృష్టిలో ఆనందం అంటే ఏమిటి?" అని.
పార్టీ మూడ్ లో ఉన్నారేమో,"ఈరోజులా celebrate చేసుకోవడానికి రోజూ నాకో reason దొరకడం"అన్నారు నవ్వుతూ.
************************************************
ఆఫీసునుంచి వస్తుంటే జమున గారు కలిశారు.నా ప్రాణం నిలుస్తుందా!ఆమెనీ కదిలించా.
"ఏంటో రా,ఈ ఆఫీసు,ఇంటి పనుల ఒత్తిడితో ఆయన,చింటూతో లతో ఎక్కువగా గడపలేక పోతున్నా.ఆఫీసు పనులు త్వరగా అయిపోయి,ఇంట్లో వీళ్ళతో హాయిగా గడపగలిగితే అదే నాకు ఆనందం" అన్నారు పక్కనున్న చింటూను చూపిస్తూ."మరి నీకు ఎప్పుడు చింటూ హ్యాపీ?"వాడిని కుడా అడిగా."మమ్మీ,దాదీ కలిసి నన్ను టాటాకు తీసుకెళ్ళి బోలెడన్ని చాకీలు తీసిత్తారే అప్పుదు" అన్నాడు ముద్దుగా.
వారికి బై చెప్పి దారిలో వస్తుంటే ఎదురింటి తాతయ్య కనిపించారు తన మనవడు,మనవరాలితో."ఏమ్మా అఫీసునుంచా?" అడిగారు."అవును తాతగారూ!మీరు వాకింగ్ కు వచ్చారా?" కాసేపు మట్లాడి నా సందేహాన్ని ఆయన ముందూ ఉంచా."ఇంకెముందమ్మా,ఇదిగో నా మనవడు,మనవరాలూ!వీళ్ళతో ఆడుకుంటూ గడిచిపోయిన నా బాల్యాన్ని మళ్ళీ కొత్తగా అనుభవిస్తున్నానే,అదే నాకు ఆనందం " అన్నారు బోసినవ్వుతో అందంగా.
ఆయన దగ్గర సెలవు తీసుకొని ఇంకొంచెం ముందుకు రాగానే తెలిసిన నన్ కనిపించారు."మంచి టైం కు కనిపించారు" అనుకొని ఆమెనూ అడిగా "సిస్టర్!మీ దృష్టిలో ఆనందం అంటే ఏమిటి?" అని.ఆమె నిర్మలంగా నవ్వుతూ,"నిస్సహాయులకు వీలైన సహాయం చేసినపుడు వారి కళ్ళలో కనిపించే తృప్తే నాకు ఆనందం"అన్నారు.
ఆలోచిస్తూ ఇంటిదారిపట్టా.గేటు తీయగానే టైగర్ తోకూపుకుంటూ ఎదురొచ్చింది.దాన్ని కూడా వదలాలనిపించలేదు."నీకేమిటే ఆనందం ఇచ్చేది?" ఎత్తుకుని అడిగా."ఇంటికి రాగానే మొదట నాతోనే ఆడుకోవాలి" అంటున్నట్టు కుయ్ కుయ్ మంటూ తోకూపింది.
ఇంట్లోకి వెళ్ళి చూస్తే కజిన్ వచ్చాడు.పలకరింపులయ్యాక,"ఏరా నువ్వేమంటావ్ ఆనందం అంటే?" అనడిగా."అక్కా!నాకు మాత్రం నాన్న ఎందుకూ,ఏమిటీ అని అడక్కుండా అడిగినంత పాకెట్ మనీ ఇచ్చేసి క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళినా లైట్ తీసుకుని ఏమీ అనకుండా వుంటే అదే" అన్నాడు అల్లరిగా.
"ఆహా!ఈసారి ఇంటికొచ్చినపుడు బాబాయికి చెప్తా నీ సంగతి" ఆటపట్టించా.
************************************************
రాత్రి భోజనాల తర్వాత నాన్న కు చెప్పా పొద్దున్నుంచీ నా అనుభవాలని.

"నాన్నా! ఈ రోజంతా నేను చాలా మందితో మాట్లాడాను.ఏ ఇద్దరూ ఒకే విషయం వారికి ఆనందం కలిగిస్తుందని చెప్పలేదు.నువ్వు చెప్పు,ఏది నిజమైన ఆనందం అంటే"నాన్న నవ్వుతూ,"ఆనందం ఒక భావోద్వేగం రా!అది ఎవరికి వారు మాత్రమే అనుభవించగలిగే ఉన్నతస్థితి.ఇలాంటి భావాలను అనుభవించగలమే తప్ప ప్రశ్నించలేం.తమ నేపధ్యాలూ,అనుభవాల దృష్ట్యా ఎవరి ఉద్వేగాలు వారికి ఉన్నతంగా అనిపిస్తాయి.ఇతరులతో పోల్చి చూసినపుడు ఒకరి అనుభూతులు మరొకరికి చాలా సింపుల్ గా,చిన్న విషయాలుగా కనిపించొచ్చు.అలాగని వాటి విలువను,అది వారిపై చూపించే ప్రభావాన్ని తక్కువ చేయలేం.ఒక ధనవంతుడికి తను పెద్ద కాంట్రాక్ట్ పొందడం ఆనందాన్నిస్తే,ఒక యువకుడికి ఇది చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు. కానీ అదే యువకుడికి ప్రేయసి తన ప్రేమను అంగీకరించడం గొప్ప ఆనందం కలిగించొచ్చు.అందుకే ,ఆనందం ..అది రేపే ఉద్వేగం ఖండితంగా వ్యక్తిగతం.జీవితం లో మనకు ఎదురయ్యే చిన్న చిన్న ఆనందాల్ని మిస్సవ్వకుండా అనుభవిస్తూ..మరికొన్ని అలాంటి సంధర్భాలను మనమే క్రియేట్ చేసుకుంటూ.. పక్క వాళ్ళకు కూడా ఆనందాన్ని పంచుతూ..వీలైతే అవసరంలో ఉన్నవాళ్ళకు చేతనైన సహాయం చేస్తూ..జీవితం హాయిగా గడిపేయడమే నా దృష్టిలో అసలైన ఆనందం అంటే" అన్నారు.
************************************************
ప్రయత్నిస్తున్నా అర్థం చేసుకోవడానికి...